Friday, 12 June 2026 01:43:45 AM

పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌పై ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం.... ⏩ రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్, ఎయిర్‌పోర్ట్ వివరాలు ఇవ్వని కలెక్టర్ వైఖరిపై మండిపాటు

⏩ ఎంపీ హోదాలో అడిగినా సమాధానం రాకపోతే ప్రజల పరిస్థితి ఏమిటి? ప్రశ్నించిన వంశీకృష్ణ

Date : 17 September 2025 08:47 PM Views : 588

ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : పెద్దపల్లి జిల్లాలో అధికారుల నిర్లక్ష్య ధోరణిపై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వైఖరిపై మండిపడుతూ, “ఒక ఎంపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?” అంటూ నిలదీశారు. రామగుండం ఈఎస్ఐ హాస్పిటల్, ఎయిర్‌పోర్ట్ వివరాలు కోరగా, కలెక్టర్ “నా దగ్గర లేవు” అంటూ నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చిన తీరు ఎంపీ ఆగ్రహానికి కారణమైంది.బుధవారం జిల్లా ప్రధాన ఆసుపత్రిలో స్వస్తి నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రి మాతృ వందన పథకం కింద మహిళలకు కలిగే ప్రయోజనాలను వివరించారు. మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. “మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం బాగుంటుంది. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది. అందుకే కేంద్రం మహిళల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి” అని అన్నారు.ఈ కార్యక్రమం అనంతరం ఆసుపత్రి సిబ్బంది, రోగులు ఎంపీకి సమస్యలను తెలియజేశారు. ముఖ్యంగా అంబులెన్స్ కొరతపై ఆసుపత్రి సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన ఎంపీ వంశీకృష్ణ, “ప్రజల ప్రాణాలకు సంబంధిత అంశం. దీనిని తక్షణమే పరిష్కరిస్తాను. నా లాడ్స్ నిధుల ద్వారా అంబులెన్స్ ఏర్పాటు చేస్తాను. ఆసుపత్రి సేవల్లో ఎక్కడా లోపాలు ఉండకూడదు” అని హామీ ఇచ్చారు.తర్వాత ఎంపీ వంశీకృష్ణ కొత్తగా నిర్మాణంలో ఉన్న జిల్లా ప్రధాన ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. పనుల పురోగతిని అడిగి తెలుసుకుని, త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. “ప్రజలకు త్వరగా కొత్త భవనం అందుబాటులోకి రాకపోతే ఇబ్బందులు పెరుగుతాయి. కాబట్టి పనులను వేగవంతం చేసి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయండి” అని స్పష్టం చేశారు.ఇంతవరకు సాధారణంగా కొనసాగిన సమావేశం, సమీక్షలో కలెక్టర్ వైఖరి ఎంపీ ఆగ్రహానికి కారణమైంది. ఎంపీ వంశీకృష్ణ నేరుగా కలెక్టర్‌ను నిలదీశారు. “ప్రజా సమస్యలపై నేను మెసేజ్‌లు చేస్తే రిప్లై ఇవ్వకపోవడం ఏంటి? నేను అడిగిన రామగుండం ఎయిర్‌పోర్ట్, ఈఎస్ఐ ఆసుపత్రి వివరాలు ఎందుకు ఇవ్వలేదు? ఎంపీ హోదాలో అడిగినా సమాధానం రాకపోతే సామాన్య ప్రజలు ఏం చేయాలి?” అని గట్టిగా ప్రశ్నించారు.ఎంపీ వంశీకృష్ణ తన ఆగ్రహ స్వరాన్ని పెంచుతూ, “ప్రజల ద్వారా ఎన్నికైన నేను ప్రజల సమస్యలు పరిష్కరించడమే నా ధ్యేయం. ఒక కలెక్టర్ ప్రజా ప్రతినిధి అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యానికి అవమానం. ఇది రిక్వెస్ట్ కాదు, కలెక్టర్‌గా మీ బాధ్యత. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలి. ఎవరైనా ఎంపీ చెప్పిన పనులు చేయొద్దని నిబంధనలు పెట్టారా?” అని నిలదీశారు.ఎంపీ చేసిన ప్రశ్నలకు కలెక్టర్ కోయ శ్రీహర్ష ఒక్క మాట కూడా చెప్పలేక సైలెంట్‌గా నిలిచిపోయారు. అక్కడి వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎంపీ మాటలతో విస్మయానికి గురైన అధికారులు, సిబ్బంది మౌనంగా ఉండిపోయారు. చివరికి కలెక్టర్ సమాధానం చెప్పకుండానే అక్కడి నుండి వెనుదిరిగారు.ఈ ఘటనతో జిల్లా రాజకీయ వర్గాల్లో, అధికార వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. ఎంపీ వంశీకృష్ణ ధైర్యంగా కలెక్టర్‌ను ప్రశ్నించడం, ప్రజల తరఫున నిలబడి అధికారులను నిలదీయడం ప్రత్యేకంగా నిలిచింది. ప్రజల సమస్యలను నిర్లక్ష్యం చేసే అధికారులపై ఇకపై ఇలాంటి ఆగ్రహం వ్యక్తం చేయాల్సిన అవసరం ఉందని స్థానిక ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎంపీ వంశీకృష్ణ వ్యాఖ్యలు ఇప్పుడు జిల్లా అంతటా హాట్ టాపిక్‌గా మారాయి. “ప్రజా సమస్యలపై స్పందించని కలెక్టర్లకు ఇది గట్టి హెచ్చరిక” అని పలువురు పేర్కొంటున్నారు. మరోవైపు కలెక్టర్ మౌనం కూడా అనేక సందేహాలకు తావిస్తోంది.ప్రజా ప్రతినిధుల ఆదేశాలకు, ప్రజల అవసరాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వకపోతే ఇకపై ఇదే విధంగా నిలదీయాల్సిందేనని ఎంపీ వంశీకృష్ణ స్పష్టం చేయడం గమనార్హం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :