Sunday, 26 April 2026 04:35:17 PM

నేను అడ్మిట్ చేసుకోను... నువ్వు ఎవరికి కంప్లైంట్ చేసుకుంటావో చెప్పుకో...

వేములవాడ ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ నర్స్ మాటలు... 108 సిబ్బందితో డ్యూటీ నర్సు మాటలు...వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అమానవీయ ఘటన...

Date : 12 March 2026 09:28 PM Views : 604

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ఏరియా ఆసుపత్రిలో వైద్యసేవల నిర్లక్ష్యం మరోసారి వెలుగులోకి వచ్చింది. అత్యవసర పరిస్థితిలో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి సరైన చికిత్స అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సిన ఘటన స్థానికంగా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.రుద్రంగి మండలానికి చెందిన ఓ గర్భిణీకి అకస్మాత్తుగా ప్రసవ వేదనలు ప్రారంభమవడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ సాయంతో ఆమెను వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో గత 45 రోజులుగా గైనకాలజిస్ట్ అందుబాటులో లేరని సిబ్బంది చెప్పి ఆమెను అడ్మిట్ చేసేందుకు నిరాకరించినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితి ఉన్నప్పటికీ సరైన వైద్యసేవలు అందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తున్నారు.అంతేకాకుండా గర్భిణీని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు రిఫర్ లెటర్ ఇవ్వాలని కుటుంబ సభ్యులు కోరగా డ్యూటీలో ఉన్న నర్సు బాధ్యతా రాహిత్యంగా స్పందించడంతో పాటు 108 అంబులెన్స్ సిబ్బందిపై కూడా దురుసుగా ప్రవర్తించినట్లు సమాచారం. ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ ఎందుకు లేరని ప్రశ్నించగా “ఉదయం వచ్చి సూపరింటెండెంట్‌ను అడుగు” అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చినట్లు బాధితులు పేర్కొన్నారు.ఆసుపత్రి సిబ్బంది సహకరించక పోవడంతో గర్భిణీ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అత్యవసర సమయంలో తమ వద్ద డబ్బు కూడా లేదని, ఈ పరిస్థితిలో ఏం చేయాలో తెలియకపోతున్నామని గర్భిణీ తండ్రి కన్నీటి పర్యంతమయ్యారు. చివరకు పరిస్థితి విషమించడంతో గర్భిణీని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను తక్షణమే నియమించాలని, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా ఈ విషయంపై స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను కోరినట్లు సమాచారం.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :