Sunday, 26 April 2026 04:39:56 PM

వన్ టౌన్ సీఐ, గన్‌మెన్‌కు కోర్టు నోటీసులు...?

– శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఆదేశాలు...?

Date : 18 February 2026 04:00 PM Views : 956

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని పట్టణంలో న్యాయవాదిపై జరిగిన ఘటనపై ఉద్రిక్తత మరింత తీవ్ర రూపం దాల్చింది. ఈ ఘటనకు సంబంధించి వన్ టౌన్ సీఐతో పాటు ఆయన గన్‌మెన్‌కు కోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశమైంది. శుక్రవారం ఉదయం జరగనున్న విచారణకు ఆధారాలతో సహా తప్పని సరిగా హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.గత 6 రోజులుగా గోదావరిఖని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయ వాదులు విధులు బహిష్కరించి నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయవాది తిలక్‌పై వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి దురుసుగా ప్రవర్తించారని, సెల్‌ఫోన్ లాక్కొని అవమానకరంగా వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి. ఈ సంఘటనపై స్పందించిన న్యాయవాదులు పోలీసు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కోర్టు విధుల బహిష్కరణకు దిగారు.ఈ నేపథ్యంలో కోర్టు జారీ చేసిన నోటీసులు వన్ టౌన్ సీఐకి మరింత ఇబ్బందికరంగా మారాయి. అత్యుత్సాహంతో వ్యవహరించిన సీఐ చర్యలు ఇప్పుడు ఆయనను ఇరకాటంలోకి నెట్టాయనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. న్యాయ వ్యవస్థ పట్ల అవమానకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు.మరోవైపు, న్యాయ వాదులు తమ నిరసనలను మరింత ఉద్ధృతం చేస్తూ శనివారం వరకు కోర్టు విధులను బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు పోరాటం కొనసాగిస్తామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు వెనక్కి తగ్గబోమని వారు హెచ్చరించారు.ఈ పరిణామాలతో గోదావరిఖనిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శుక్రవారం జరిగే విచారణలో ఏమి తేలుతుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది. పోలీసులు, న్యాయవాదుల మధ్య పెరుగుతున్న ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సి ఉంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :