ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / హన్మకొండ జిల్లా : విద్యా సంవత్సరం ఇంకా ప్రారంభం కాకుండానే ఉపాధ్యాయులను, అధ్యాపకులను ప్రైవేట్ విద్యా సంస్థలు వేధిస్తున్నాయి. మండుటెండల్లో ఇంటింటి ప్రచారం చేసి విద్యార్థులను చేర్పించాలని ఒత్తిడి చేస్తున్నాయి. అడ్మిషన్లను తీసుకు రాకుంటే జీతాలు ఇవ్వబోమని హెచ్చరిస్తున్నాయి. ప్రైవేట్ విద్యాసంస్థల తీరుతో ప్రైవేట్ టీచర్లు మనోవేదనకు గురి అవుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు రాక పీజి, డిగ్రీ, బీ ఈడీ చేసిన ఎంతోమంది జీవనం సాగించడానికి ప్రైవేట్, కార్పోరేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఉపాద్యాయులు, అధ్యాపకులుగా పని చేస్తున్నారు. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థుల ప్రవేశాలకు టార్గెట్ విధిస్తూ యాజమాన్యాలు వేధింపులకు గురి చేస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లో వందలాదిగా వెలిసిన ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు నెలరోజులుగా ఆయా పాఠశాలలు కళాశాలల్లోని ఉపాధ్యాయులను ఇంటింటికి తిప్పుతున్నారు. వారు ప్రతీ ఇంటికి వెళ్లి మీ ఇంట్లో పిల్లలు ఉన్నారా, వారు ఏం చదువుతున్నారు అనే సమాచారం సేకరిస్తున్నారు. వారిని తమ పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించండి అని తల్లితండ్రులను బ్రతిమాలుతూ కోరుతున్నారు. ఇచ్చిన ప్రవేశాల టార్గెట్లు పూర్తి చేస్తేనే వేసవి సెలవుల్లో జీతాలు ఇస్తామని కొన్ని విద్యాసంస్థలు నిభందనలు పెడుతున్నాయి. ఒక్కొక్కరు కనీసం పది నుండి పదిహేను మందిని చేర్పించాలని లక్ష్యం పెడుతున్నారు. అలా చేర్పించిన తరువాత కూడా సెలువుల అనంతరం విద్యాసంస్థలు తెరిచాక కూడా వారి ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందా తెలియని అయోమయంలో ఉంటున్నారు. ఇచ్చే అరకొర జీతాలు నిలిపి వేస్తారని భయంతో ఉపాధ్యాయులు సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు. భగభగ మండుతున్న ఎండల్లో ఇంటింటికీ తిరుగుతూ చెమటలు కక్కుతున్నారు. ఒకవైపు బోధన మరోవైపున అడ్మిషన్లకు టార్గెట్ పూర్తి చేసే పనిలో ప్రైవేట్ కార్పోరేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులు తీవ్రమైన ఒత్తిడికి లోనై మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడుతున్నారు. తమ ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోలోనే మదన పడుతూ కుమిలిపోతున్నారు. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొస్తున్న సమయంలో ఉన్న ఉద్యోగాల్ని వదులుకోలేక, ఒత్తిడికి తట్టుకోలేక వారు పడుతున్న బాధలు వర్ణించ లేక పోతున్నారు. చాలీచాలని జీతాలు చెల్లిస్తూ విద్యాసంస్థల యజమాన్యాలు వారితో చెలగాటం ఆడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో బోధించే వారికి తక్కువ జీతాలను ఇస్తూ శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారు. టార్గెట్లు పూర్తి చేయని వారిని నోటికొచ్చినట్లు తిట్టి తమ మనోభావాలు దెబ్బ తీస్తున్నట్లు టీచర్లు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
Admin
Aakanksha News