ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మహిళల రక్షణ, భద్రత ప్రధాన లక్ష్యంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నాయని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ తెలిపారు. మహిళలు, యువతులు ఏ సమస్య ఎదురైనా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో రెండు షీ టీమ్ బృందాలు పనిచేస్తున్నాయని, వీటి ఆధ్వర్యంలో స్కూళ్లు, కళాశాలలు, పార్కులు, షాపింగ్ మాల్ లతో పాటు పబ్లిక్ ప్రదేశాల్లో అవగాహన కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పారు. మహిళల రక్షణకు సంబంధించి రాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో చట్టం, గుడ్ టచ్–బ్యాడ్ టచ్, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్న నిషేధ చట్టాలు, డయల్ 100 సేవలు, T-SAFE యాప్ వంటి అంశాలపై విద్యార్థులు, మహిళలకు విస్తృత ప్రచారం జరుగుతోందని ఆయన వివరించారు. మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న వేధింపులు, రోడ్డుపై అసభ్య ప్రవర్తన, సైబర్ వేధింపులు వంటి సమస్యలపై నేరుగా షీ టీమ్స్‌ను సంప్రదించవచ్చని సీపీ తెలిపారు. QR కోడ్, వాట్సాప్, ఆన్లైన్ ఫిర్యాదు, అలాగే రామగుండం షీ టీం నెంబర్ 6303923700, పెద్దపల్లి జోన్ నెంబర్ 8712659386, మంచిర్యాల జోన్ నెంబర్ 8712659386 లేదా డయల్ 100 ద్వారా వెంటనే సహాయం అందించబడుతుందని తెలిపారు.సైబర్ నేరాలు, మహిళలపై అసభ్యకర పోస్టులు, సైబర్ వేధింపులపై షీ టీమ్, సైబర్ పోలీస్ సంయుక్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సీపీ అంబర్ కిషోర్ ఝా వెల్లడించారు.మహిళలు మౌనంగా ఉండొద్దు. ఎవరికైనా వేధింపులు ఎదురైనా వెంటనే ఫిర్యాదు చేయాలి. షీ టీమ్స్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయి. భద్రత, రక్షణలో పోలీసులు మీతో ఉన్నారు” అని పిలుపునిచ్చారు.
Admin
Aakanksha News