ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఓ కాంట్రాక్ట్ సూపర్వైజర్ వేధింపులతో మహిళా ఉద్యోగుల గతి గండంగా మారింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే అనుచరుల ప్రోత్సాహంతో అతని ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆసుపత్రిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మహిళలపై సూపర్వైజర్ వేధింపులు తీవ్రమవుతున్నాయని, ఇటీవలి ఘటనలో ఓ మహిళను అవమానకరంగా వేధించడంతో ఆమె ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. భవనంపైకి ఎక్కి ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆ మహిళను తోటి కార్మికులు అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని వివరించారు.ఈ నేపథ్యంలో సదరు సూపర్వైజర్ పై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గమని, ఆసుపత్రి సూపరిండెంట్, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ దృష్టిలో ఉన్నా ఆయనను ప్రోత్సహించడం సిగ్గు చేటుగా ఉందన్నారు. సూపర్వైజర్ కాంట్రాక్టర్లతో కుమ్మక్కై మహిళల ఫోటోలు, వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేయడం, నచ్చనివారిని తొలగించి తానిష్టమైనవారిని నియమించడం కొనసాగుతున్నదని ఆరోపించారు.పొట్టకూటి కోసం పనిచేస్తున్న సిబ్బందిని వేధించడం, తప్పుడు ఆరోపణలతో తొలగించడంతో పాటు, ఇటీవల విధుల నుంచి తొలగించబడి మళ్లీ తీసుకోవాలని వచ్చిన నాలుగు మంది మహిళలపై అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ ఘటనలు చోటుచేసుకున్నాయని చెప్పారు.
పార్టీ కార్యాలయంమా.. ఆసుపత్రి పాలన..!
స్థానిక రామగుండం ఎమ్మెల్యే అనుచరుల అండతో ఆసుపత్రిని అధికార పార్టీ కార్యాలయంలా మార్చారని, మహిళలపై అసభ్య ప్రవర్తనను ప్రోత్సహిస్తున్నారని దినేష్ ఆరోపించారు. బాధ్యత లేని సూపరిండెంట్‌ను వెంటనే తొలగించి నూతన వ్యక్తిని నియమించాలని డిమాండ్ చేశారు.
తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనలు తప్పవు...
సూపర్వైజర్‌ను తక్షణమే సస్పెండ్ చేయకపోతే తీవ్ర ఆందోళనలు చేయాల్సి వస్తుందని, ప్రభుత్వ ఆసుపత్రిలో రాజకీయ జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్, వైద్యాధికారులదేనని స్పష్టం చేశారు. మహిళా ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు భవిష్యత్తులో తీవ్ర ఉద్యమాలకు వెనుకాడమని హెచ్చరించారు.
Admin
Aakanksha News