ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం కలెక్టర్ మంథని ఆర్డీవో కార్యాలయంలో అభివృద్ధి పనులకు భూ కేటాయింపులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిపాలనాధికారి మాట్లాడుతూ మంథనిలో ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు అవసరమైన భూ కేటాయింపు ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. అభివృద్ధి పనులకు గుర్తించిన ప్రభుత్వ భూములను సంబంధిత శాఖలకు బదలాయించాలని అధికారులకు సూచించారు. మంథనిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నిర్మాణానికి 3 ఎకరాలు, తహసిల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారి, రోడ్లు భవనాల శాఖ కార్యాలయం భవనాల నిర్మాణాలకు 2 ఎకరాల 21 గుంటలు, కళాభారతి నిర్మాణానికి 8 గుంటలు, కమ్యూనిటీ హాల్ భవనం, ఆర్ అండ్ బీ అతిధి గృహం నిర్మాణానికి ఎకరం, విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణానికి 30 గుంటలు, అడవి సోమనిపల్లిలో సమీకృత గురుకులాల నిర్మాణానికి 25 ఎకరాల ప్రభుత్వ భూమి గుర్తించి సంబంధిత శాఖలకు బదలాయించాలని ఆదేశించారు. మంథని పట్టణంలో దేవాదాయ శాఖ పరిధిలో అనుకూలమైన భూములు ఉంటే వాటికి ప్రస్తుతం మార్కెట్ విలువను సదరు దేవాలయానికి చెల్లించి అభివృద్ధి పనులకు కేటాయించేల చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్, ఈఈ ఆర్ అండ్ బీ భావ్ సింగ్ లు పాల్గోన్నారు.
Admin
Aakanksha News