ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఓదెల మండలంలోని 22 గ్రామాల ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని 30 పడకల ఆస్పత్రిగా విస్తరించాలని కోరుతున్నారు. ప్రస్తుతం మండలంలో సరైన వైద్య సదుపాయాలు లేక పేద, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు ఎదురయ్యే ప్రమాదాలు, పాము కాట్లు, ప్రసూతి అత్యవసరాలు,గుండెపోటు వంటి అనుకోని పరిస్థితుల్లో తక్షణ వైద్య సేవలు అందక,దూర ప్రాంతాలకు తరలించే సమయంలో ప్రాణాలపై ముప్పు నెలకొంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న 24 గంటల ఆసుపత్రి కేవలం ఒక స్టాఫ్ నర్స్ ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తున్నందున,దీని ద్వారా కలిగే ప్రయోజనం చాలా తక్కువ గా ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకే సమీప పట్టణాలకు తరలించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు వాపోతున్నరు. ఓదెల మండలం లో 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు కావడం వలన వైద్య నిపుణుల బృందం అందుబాటులోకి వస్తుంది. ఎక్స్‌రే, స్కానింగ్,గర్భిణీ స్త్రీల ప్రసూతి సేవలు, పిల్లల వైద్య విభాగం,అత్యవసర చికిత్సా విభాగం, శస్త్రచికిత్సా సదుపాయాలు లభిస్తాయి. దీంతో మండల ప్రజలు తగిన వైద్య సేవలను స్థానికంగానే పొందే వీలుంటుందని ఓదెల డెవలప్మెంట్ ఫోరమ్ అధ్యక్షులు కలవేని శ్రీనివాస్ తెలిపారు. ఇటీవల ఓదెల కంటే తక్కువ జనాభా ఉన్న మానకొండూరు నియోజకవర్గంలోని ఇల్లంతకుంట గ్రామంలోనే ప్రభుత్వం 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేయడం స్థానికులకు ఆశలు కలిగించింది. అదే విధంగా ఓదెలలో కూడా 30 పడకల ఆసుపత్రి ఏర్పాటు పూర్తిగా సాధ్యమని భావిస్తున్నారు. అందువల్ల ఎమ్మెల్యే విజయరామనరావు చొరవ తీసుకుని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వెంటనే ఆసుపత్రి విస్తరణ చర్యలు చేపట్టాలని మండల ప్రజలు ఏకగ్రీవంగా డిమాండ్ చేస్తున్నారు.
Admin
Aakanksha News