Tuesday, 28 July 2026 04:49:07 AM

కాక కోటాలో వారసుడికి అవమానం...

పారిశ్రామికవేత్తగా మొదలు, ప్రజాప్రతినిధిగా ఎదిగిన గడ్డం వంశీ...ప్రజా ప్రతినిధుల మౌనం... కాంగ్రెస్ పార్టీపై తిరోగమనం?

Date : 20 May 2025 09:49 AM Views : 1046

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానాన్ని ఏర్పరుచుకున్న ప్రముఖ నేత కాక వెంకటస్వామి కుటుంబం ఇప్పుడు ఓ అవమాన ఘటనతో వార్తల్లో నిలిచింది. మాజీ ఎంపీ కాక వెంకటస్వామి మనవడు, ప్రస్తుత పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకి భూపాలపల్లి జిల్లా సరస్వతి పుష్కరాల్లో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఆనాడు పేద ప్రజల కోసం తాత ఎన్నో కార్యక్రమాలు చేపట్టి పేద ప్రజల కోసం ఎన్నో పోరాటాలు నిర్వహించిన ఘనత వారికే దక్కింది. అయితే భూపాలపల్లిలో ఇటీవల నిర్వహించిన సరస్వతి పురస్కారాల కార్యక్రమంలో గడ్డం వంశీ పేరు, పోస్టర్లలో ప్రస్తావన లేకపోవడం – ఇది కేవలం చిన్న పొరపాటేనా? లేక సంకల్పితమైన దుశ్చర్యా? అనే సందేహలు ప్రజల్లో తలెత్తుతున్నాయి.. ఎంపీగా ఉన్న గడ్డం వంశీ, తన నియోజకవర్గం అభివృద్ధిలో క్రియాశీలంగా పాల్గొంటున్నా, కొన్ని ప్రభుత్వ కార్యక్రమాలలో ఆయనకు గుర్తింపు ఇవ్వకపోవడాన్ని అభిమానులు, నాయకులు అన్యాయంగా భావిస్తున్నారు. వెనుకబడిన వర్గాలపై ఎందుకు ఈ మైకమైన వివక్ష అని కొంత మంది నాయకులు, వారి అభిమానులు ప్రశ్నిస్తున్నారు. కాక వెంకటస్వామి తెలంగాణ రాజకీయాల్లో "గుడిసెల వెంకటస్వామి"గా పేరొందిన నేత. మూడు పర్యాయాలు ఎంపీగా సేవలందించి, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాడిన నాయకుడు. ఆయన కుమారుడు వివేక్ వెంకటస్వామి కూడా ఎంపీగా పని చేశారు, ఆయన సతీమణి అంబేద్కర్ యూనివర్సిటీ స్థాపన ద్వారా పేద విద్యార్థులకు విద్యా అవకాశాలు కల్పించారు. ఎంతో మంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు తీర్చిదిద్దిన ఘనత కూడా వారికే దక్కుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలను సైతం కల్పించి బడుగు బలహీన వర్గాలు, కార్మికుల జీవితాల్లో వెలుగులను నింపారు. దీంతో విద్య, సేవ, పేదల పక్షపాతి కుటుంబంగా ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. వెనుకబడిన దళిత వర్గానికి చెందిన గడ్డం వంశీ, తన తాత పాత్రాన్నే నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నారు. తాత ఆశయాలకు అనుగుణంగా నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యలపైనే పోరాటాలు నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. వారసుడి పరిపాలన తాతని గుర్తు చేయడంతో ఆయన రూపంలో దివంగత నేతను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పారిశ్రామికవేత్తగా ఉన్నప్పటికీ, ప్రజల అభిమానాన్ని నమ్ముకొని రాజకీయ రంగ ప్రవేశం చేశారు. భారీ మెజార్టీతో గెలిచి, ఓదిగి ఉండే స్వభావంతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఈ సందర్భంగా తనకు జరిగిన అన్యాయంపై ఫ్లెక్సీలలో తన పేరు లేకపోవడంపై గడ్డం వంశీ సోషల్ మీడియాలో స్పందిస్తూ –“నా తాత ఆశయాల మేరకు పనిచేస్తున్న నన్ను, నా నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమల్లో గుర్తించకపోవడం బాధాకరం. నేను దళితుడినన్న కారణంగానే ఈ అవమానం జరిగిందా?” అంటూ ప్రశ్నించారు. అలాగే కొంత మంది అగ్రవర్ణ నేతల కుట్ర ఇది” అని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రోటోకాల్ ప్రకారం ఆహ్వానించకుండా ఎన్ని ఇబ్బందులు పెట్టిన ఎన్ని రకాలుగా అవమానపరిచిన ప్రజల కోసం, ప్రజలు పెట్టుకున్న నమ్మకం కోసం వారి వెంటే ఉంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నానన్నారు. పుష్కరాల్లో జరిగిన ఘటనపై వివిధ దళిత సంఘాలు, మేధావులు ఈ అంశంపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టి సారించాలని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే ఘటనపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్సీ ఎస్టీ సంఘాల నేతలు సంబంధిత ఉన్నత అధికారులకు ఎస్సీ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదులను అందించారు.

ప్రజా ప్రతినిధుల మౌనం – కాంగ్రెస్ పార్టీపై తిరోగమనం?

ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి నేతలకు మౌనం కలిగిస్తోంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో ఆయా నాయకులకు సంబంధించిన నేతలు రెండు వర్గాలుగా విడిపోవడం తీవ్ర స్థాయిలో చర్చకు దారితీస్తుంది. సామాజిక సమానత్వానికి కట్టుబడి ఉన్న పార్టీగా పేరుగాంచిన కాంగ్రెస్ – ఒక దళిత ఎంపీకి జరిగిన ఈ సంఘటనపై స్పందించకపోతే, నైతిక పరిపాలనపై ప్రశ్నలు తలెత్తకుండా ఉండవు అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

మూసివేసే మాట...

కాక కుటుంబం రాజకీయంగా చేసిన సేవలు తెలంగాణకు మరువలేనివి. అలాంటి వారసుడికి జరిగిన అవమానం పట్ల అధికార పార్టీ తగిన స్పందన చూపకపోతే, అది సామాజికంగా, రాజకీయంగా ప్రమాదకరమనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం గడ్డం వంశీ విషయంలో కాదు – సామాజిక న్యాయంపై నమ్మకంగా ఉన్న ప్రతి ఒక్కరి ప్రశ్న... గతంలో కూడా ఎన్నో కార్యక్రమాల్లో ఇలాగే జరగడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి. ఇప్పటికైనా దీనిని సరిదిద్దకపోతే రాజకీయ వ్యాప్తంగా తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొనే పరిస్థితులు వస్తాయని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :