ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం బసంత్‌నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు భారీ స్థాయిలో మహా ధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ప్రాదేశిక లారీల నుండి టోల్ వసూలు చేయడాన్ని నిరసిస్తూ, హెచ్‌కేఆర్ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.లారీ యజమానులు టోల్ వసూలును నిలిపివేస్తూ ప్లాజాను స్తంభింపజేశారు. గత రెండు రోజులుగా ఈ పరిస్థితి కొనసాగుతుండగా, ఈరోజు వంటావార్పు కార్యక్రమం నిర్వహిస్తూ తమ నిరసనను వ్యక్తపరిచారు. హెచ్‌కేఆర్ యజమాన్యం గత 12 సంవత్సరాలుగా నిరంతరం టోల్ వసూలు చేస్తున్నప్పటికీ, హైవేపై కనీస సౌకర్యాలు లేవని వారు ఆరోపించారు. టోల్ మాఫీ చేయకుంటే నిరవధిక నిరసనలు చేపడతామని హెచ్చరించారు.ఇదే క్రమంలో, హైవేకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు, పచ్చదనం (గ్రీనరీ), ఆంబులెన్స్, రెస్ట్ రూములు, మెడికల్ సౌకర్యాల ఏర్పాటును డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో లారీ యజమానుల సంఘం నాయకులు శ్రీనివాస్ రెడ్డి, బయ్యపు మనోహర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు పాలకుర్తి మండల అధ్యక్షులు ముక్కెర శ్రీనివాస్ పాల్గొన్నారు. రామగుండం ప్రాంతానికి చెందిన లారీ యజమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
Admin
Aakanksha News