ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో భారీ స్థాయిలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న ముఠాను రామగుండం పోలీస్ కమిషనరేట్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB), టెలికమ్యూనికేషన్ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో పట్టుకున్నారు. జూలై 30న శ్రీమతి శిఖా గోయల్, ఐపీఎస్, TGCSB డైరెక్టర్, శ్రీ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్, కమిషనర్ ఆఫ్ పోలీస్, రామగుండం ఆదేశాల మేరకు ఈ సోదాలు నిర్వహించబడ్డాయి.జన్నారం వోడాఫోన్ టవర్ పరిధిలో అనుమానాస్పదంగా పనిచేస్తున్న సిమ్ ప్యానెల్స్‌పై అందిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. జన్నారం రాఘవేంద్ర థియేటర్ సమీపంలోని ఇంట్లో నిర్వహించిన సోదాల్లో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వీరంతా విదేశీ నంబర్లను దేశీయ కాల్‌లుగా మారుస్తూ, సామాన్య ప్రజలను మోసగిస్తున్నట్లు వెల్లడైంది. నిందితుల్లో యాండ్రాపు కామేష్ (మన్యం జిల్లా, ఏపీకి చెందిన వ్యక్తి), బావు బాపయ్య, బావు మధుకర్ (లక్ష్మీపూర్ గ్రామం, గొల్లపెల్లి మండలం వాసులు), గోట్ల రాజేష్ (కిష్టాపూర్ గ్రామానికి చెందిన వాడు) ఉన్నారు.పాలవల్సల సాయి కృష్ణ అలియాస్ జాక్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఈ ముఠా పని చేస్తోందని పోలీసులు పేర్కొన్నారు. కంబోడియా దేశంలో ఉన్న జాక్ సూచనలతో నిందితులు అద్దె గదిని ఏర్పాటు చేసి, దానిలో సిమ్ ప్యానెల్స్, డిజిటల్ పరికరాలను అమర్చి ఫేక్ ఐడెంటిటీలతో సిమ్ కార్డులు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. లక్షలాది రూపాయలు గల పరికరాలు ఉపయోగించి టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా డైరెక్షన్లు తీసుకుంటూ నేర కార్యక్రమాలను కొనసాగించినట్లు విచారణలో వెల్లడైంది.నిందితుల వద్ద నుంచి 262 సిమ్ కార్డులు, ల్యాప్‌టాప్‌లు, D-Link రౌటర్లు, మోడెమ్స్, మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ నెట్‌వర్క్ పరికరాలు, పాల్వెల్సల సాయి కృష్ణ పంపించిన డబ్బుతో కొనుగోలు చేసిన సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు నెలకు రూ.30,000 నుంచి రూ.70,000 వేతనం తీసుకుంటూ, సైబర్ మోసాల నుంచి వచ్చే ఆదాయంలో వాటా కూడా పొందుతున్నట్టు తెలిపారు.ఈ కేసుకు సంబంధించి అంతర్జాతీయ స్థాయి కాల్ లింకులు ఉన్నట్టు గుర్తించడంతో దర్యాప్తు మరింత లోతుగా కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించిన ACP మంచిర్యాల ఆర్. ప్రకాష్, సైబర్ క్రైమ్ DSP వెంకట రమణ రెడ్డి, లక్షేటిపేట CI రమణమూర్తి, టెలికాం విభాగం అధికారులు, రామగుండం సైబర్ క్రైమ్ విభాగం సిబ్బంది, జన్నారం, లక్షేటిపేట, దండేపల్లి పోలీస్ సిబ్బందిని రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్, డీసీపీ మంచిర్యాల ప్రశంసించారు.
Admin
Aakanksha News