Thursday, 11 June 2026 11:45:58 PM

సిరిసిల్లలో అమానవీయ ఘటన...

ఇంట్లోకి అనుమతించకపోవడంతో రోడ్డుపైనే వృద్ధురాలి మృతదేహం..

Date : 24 February 2026 06:01 PM Views : 382

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం సిరిసిల్ల పట్టణంలోని కార్మిక క్షేత్రంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో నివసిస్తున్న మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు ఉదయం మృతి చెందగా, ఇంటి యజమాని నిర్దయగా వ్యవహరించి మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించకపోవడంతో రోడ్డుపైనే ఉంచాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ ఘటనతో కాలనీ వాసులు, స్థానికులు దిగ్భ్రాంతికి గురయ్యారు.సమాచారం ప్రకారం, మామిడాల వీరమ్మ తన చిన్న కొడుకు బాలరాజుతో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తోంది. బాలరాజు సిరిసిల్ల టెక్స్‌టైల్ పార్కులో కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరమ్మ పెద్ద కొడుకు పాండు గతంలోనే మృతి చెందగా, భర్త విశ్వనాథం కూడా చనిపోయాడు.బాలరాజు తన భార్యతో వేరుగా ఉంటూ వృద్ధ తల్లిని చూసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఉదయం వీరమ్మ తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే మృతి చెందింది. విషయం ఇంటి యజమానికి తెలియజేయగా మృత దేహాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి అనుమతించలేదు. దీంతో చేసేదేమీ లేక బాలరాజు రోడ్డుపైనే ఓ బల్లపై మృతదేహాన్ని ఉంచాడు. నిరుపేద నేత కుటుంబం కావడంతో అంతక్రియలు నిర్వహించేందుకు కూడా డబ్బుల్లేవని బాలరాజు విలపించాడు.రోడ్డుపైనే వృద్ధురాలి మృతదేహం, బంధువుల రోదనలు, కుటుంబ సభ్యుల ధైన్య స్థితిని చూసి కాలనీవాసులు చలించిపోయారు. విషయం తెలుసుకున్న స్థానిక బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ అడిచెర్ల రూప సాయికుమార్ వెంటనే అక్కడికి చేరుకుని వృద్ధురాలికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, అంతక్రియలను తామే నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.ఈ ఘటనపై బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, అద్దె ఇంటి యజమాని వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.ఈ అమానవీయ ఘటన సిరిసిల్లలో చర్చనీయాంశంగా మారింది. నిరుపేద కార్మిక కుటుంబాల పరిస్థితి, మానవీయ విలువలు క్షీణిస్తున్నాయనే భావనను ఈ సంఘటన మరోసారి బహిర్గతం చేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :