ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం రాచపల్లి గ్రామానికి చెందిన ఆరెల్లి రవీందర్ (51) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మానేరు వాగులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు లింగయ్య కుమారుడు, గౌడ్ కులానికి చెందినవాడు, హమాలీ వృత్తి చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మృతుడు ఎక్కువగా మద్యం సేవించే అలవాటు ఉండడంతో తరచూ కుటుంబ సభ్యులతో గొడవలు జరిగేవి. భార్య, కుమారుడు పలుమార్లు మందు మానేయమని చెప్పినా ఆయన వినకపోవడంతో కుటుంబ కలహాలు కొనసాగేవి. మధ్యాహ్నం కూడా రవీందర్ మద్యం సేవించి ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు మందలించారు. ఆ తరువాత ఆయన గుంపులలోని రామభద్ర ఆలయం వద్దకు వెళ్లి తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి అక్కడ ఉన్నానని తెలిపాడు. వెంటనే కుమారుడు ఆరెల్లి దిలీప్, బంధువు ఆరెల్లి రాజు అక్కడకు చేరుకున్నారు.అక్కడికి వెళ్లి చూసేసరికి వాగు ఒడ్డున రవీందర్ బట్టలు కనిపించాయి. చాతి లోతు నీటిలోకి దిగిన ఆయన బయటకు వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయాడు. ఈ దృశ్యం గమనించిన కుమారుడు వెంటనే పరుగెత్తి పదో నెంబర్ పిల్లర్ వద్ద మునిగిపోతున్న తండ్రిని బయటకు తీశాడు. అప్పటికే స్పృహ తప్పడంతో వెంటనే 108 అంబులెన్స్‌లో జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు రవీందర్ మృతిచెందినట్లు ప్రకటించారు. మృతుడి కుమారుడు దిలీప్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తండ్రి మరణంపై ఎలాంటి అనుమానం లేదని పేర్కొన్నాడు. ఈ ఘటనపై పొత్కపల్లి ఎస్సై దీకొండ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
Admin
Aakanksha News