Tuesday, 28 July 2026 12:35:32 PM

భూపాలపల్లి జిల్లాలో కేటీకే 6 ఇంక్లైన్‌లో ఘోర ప్రమాదం...

– సింగరేణి కార్మికుడికి తీవ్ర గాయాలు...

Date : 13 September 2025 02:06 PM Views : 1215

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 6 ఇంక్లైన్ గనిలో శనివారం ఉదయం ప్రమాదం సంభవించింది. టాప్ రూప్ బోల్ట్ ఒక్కసారిగా కూలి పోవడంతో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి కార్మికుడు రాదండి మండేయ్య (57) తీవ్రంగా గాయపడ్డాడు. ఎంప్లాయి నెంబర్ 02351685 కలిగిన మండేయ్య కేటీకే 6లో 15 లెవెల్ వన్ సిమ్‌లో పనిచేస్తున్న సమయంలో పైకప్పు నుండి సుమారు ఆరు అడుగుల బండ కూలి ఆయనపై పడింది. ఈ దుర్ఘటనలో మండేయ్య ఎడమ కాలు పూర్తిగా విరగడమే కాక మోకాలు, తొంటి విరిగిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.సంఘటనను గమనించిన సహచరులు, సింగరేణి అధికారులు వెంటనే స్పందించి గాయపడిన మండేయ్యను హుటాహుటిన భూపాలపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం.అనుకోని ఈ ఘటనతో గని ప్రాంతంలో సహచర కార్మికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ సంఘటన విషయమై సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్, మోటపలుకుల రమేష్ ఆసుపత్రికి వెళ్లి మండేయ్యను పరామర్శించారు. వైద్యుల వద్ద ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.గని ప్రాంతంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇలాంటి ఘటనలకు కారణమని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే భద్రతా చర్యలను బలోపేతం చేయాలని, ఇలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా చూడాలని వారు కోరుతున్నారు.సింగరేణి కార్మిక వర్గాల్లో భయం, ఆందోళన నెలకొన్న ఈ ఘటనపై జిల్లా స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :