Wednesday, 29 July 2026 09:22:47 AM

సోదరితో రాఖీ కట్టించుకుని ఇంటికి వెళ్తుండగా తమ్ముడిని కబళించిన మృత్యువు...

నిజామాబాద్‌ జిల్లా రాఖీ పండుగ రోజు ఘోర రోడ్డు ప్రమాదం...

Date : 09 August 2025 08:09 PM Views : 500

ఆకాంక్ష న్యూస్ - క్రైం న్యూస్ / : నిజామాబాద్‌ రాఖీ పండుగ రోజు ఓ కుటుంబంలో ఆనందం కన్నీటి మడుగులో కలిసిపోయింది. సోదరితో రాఖీ కట్టించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న యువకుడు, కంటైనర్‌ వాహనం ఢీకొనడంతో మృత్యువాత పడ్డాడు. పండుగ సంతోషాన్ని క్షణాల్లో దుఃఖంగా మార్చేసిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.వివరాల ప్రకారం, నిర్మల్‌ జిల్లా బాసరకు చెందిన సాయి బబ్లూ (21) మరో యువకుడితో కలిసి బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. శనివారం ఉదయం రాఖీ పండుగ సందర్భంగా సాయి బబ్లూ తన సోదరిని చూడటానికి బాసర నుంచి నిజామాబాద్‌కు బయలుదేరాడు. నగరంలోని ఖిల్లా రోడ్డులో అత్తారింటిలో ఉన్న సోదరిని కలసి, రాఖీ కట్టించుకున్నాడు. ఆ తర్వాత తిరిగి బాసర వైపు బయలుదేరాడు. మధ్యాహ్నం సమయంలో నవీపేట్‌ మండలం జగ్గారావు ఫారం సమీపానికి రాగానే, ఎదురుగా వస్తున్న కంటైనర్‌ వాహనం వారి బైక్‌ను ఢీకొట్టింది. ఢీకొట్టిన తీవ్రతకు సాయి బబ్లూ అక్కడికక్కడే మృతిచెందాడు. తోడు ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రికి తరలించబడ్డాడు. సాయి బబ్లూ మృతి వార్త తెలుసుకున్న సోదరి, తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. రాఖీ కట్టి గంటల వ్యవధిలోనే తమ్ముడు ప్రాణాలు కోల్పోవడం వారిని శోకసముద్రంలో ముంచేసింది. స్థానిక దేవాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్న బబ్లూ, తన సరదా స్వభావం, స్నేహపూర్వక నడవడికతో అందరికీ ప్రియమైన వ్యక్తిగా ఉండేవాడని బంధువులు కన్నీరు మున్నీరుమన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పండుగ రోజున జరిగిన ఈ హృదయవిదారక ప్రమాదం, నిజామాబాద్‌ జిల్లా ప్రజలను తీవ్ర విషాదంలో ముంచేసింది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :