ఆకాంక్ష న్యూస్ - ఆకాంక్ష డెస్క్ / : భవితశ్రీ చిట్స్‌తో శ్రీకారం… బంగారు భవిష్యత్తు సాకారం” అంటూ ఎన్నో వాగ్దానాలు చేస్తూ లక్షలాదిమందిని ఆకర్షించిన సంస్థ మోసాల తీరుతెన్నులు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మామూలు చిట్ ఫండ్ వ్యాపారంలా కాకుండా, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, బహుమతులు, ప్రత్యేక పథకాలు పేరుతో ఈ సంస్థ సామాన్యులను ఎరలోకి దింపింది. కానీ చివరికి వారికి అందింది నమ్మక ద్రోహం, ఆర్థిక నష్టం, కడగండ్లే.అయితే మొదట్లో భవితశ్రీ చిట్స్, వరంగల్, హన్మకొండ, కాజీపేటలతో పాటు తెలంగాణ వ్యాప్తంగా అనేక జిల్లాల్లో బ్రాంచులు ఏర్పాటు చేసింది. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులను ఆహ్వానించి విశేషంగా కార్యక్రమాలు నిర్వహించింది. “సంస్థ వెనుక బలమైన ఆర్థిక శక్తి ఉందని, ప్రభుత్వ, రాజకీయ అనుబంధం కలిగిన మేనేజ్‌మెంట్ నడుపుతున్నదని” నమ్మకం కలిగించి ప్రజలను మరింతగా ఆకర్షించింది.వీధి, బజారు స్థాయిలో పనిచేసే చిన్నచిన్న చిట్ సంస్థలతో పోలిస్తే, ఈ సంస్థ ఆధునిక భవనాలు, ఏసీ ఆఫీసులు, ఆకర్షణీయ పోస్టర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలతో విశ్వసనీయతను కలిగించింది. దీంతో పేదలు, మధ్యతరగతి, చిన్న వ్యాపారులు ఎవరూ మినహాయింపులేకుండా సభ్యులుగా చేరారు. ఇదే ఆసరాగా చేసుకున్న భవిత శ్రీ చిట్ ఫండ్ సంస్థ ఇలా మోసాలకు పాల్పడింది...చిట్ డిపాజిట్లు సేకరించి వాటిని తిరిగి సభ్యులకు తిరిగి చెల్లించాల్సిన బాధ్యత ఉన్నా, సంస్థ యాజమాన్యం ఆ డబ్బులను వ్యక్తిగత వ్యాపారాలకే మళ్లించింది. రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఇతర ప్రైవేట్ వ్యాపారాలలో పెట్టుబడుల పేరుతో డబ్బు దారి మళ్లించారు. ప్రారంభంలో కొంతమందికి సమయానికి చెల్లింపులు జరిపి నమ్మకం కలిగించారు. కానీ క్రమంగా కొత్తగా వచ్చే డిపాజిట్లను పాతవారికి చెల్లించడమే పని అయి పోయింది. చివరకు డబ్బు కొరత తలెత్తడంతో చెల్లింపులు ఆగిపోయాయి. దీనిపై హన్మకొండ పోలీస్ స్టేషన్ ముందు వందలాది మంది బాధితులు గుమికూడి తమ వేదనను వెల్లగక్కారు. “జీవిత సర్వస్వం పెట్టాం… భవిష్యత్తు బాగుంటుందని నమ్మాం… ఇప్పుడు పాడు అయిపోయింది” అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. పదేళ్ల పాటు కష్టపడి సంపాదించిన పొదుపు మొత్తాన్ని కోల్పోయిన వృద్ధులు, పిల్లల చదువుల కోసం పెట్టుబడి పెట్టిన తల్లిదండ్రులు తీవ్ర నిరాశలో మునిగారు.దీంతో ఈ కేసులో సంస్థ ఛైర్మన్, వరంగల్ మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు A1 నిందితుడిగా ఉన్నాడు. ఆయనను హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు. మిగతా మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగరాజు, క్లర్క్ సుషాంత్‌లు పరారీలో ఉన్నారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటయ్యాయి. ఎఫ్‌ఐఆర్ నంబర్ 483/2024 కింద IPC 420 r/w 34, అలాగే తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్ట్ 1999 ప్రకారం కేసులు నమోదు చేశారు.ఒక ఒక రూపాయి కూడబెట్టి భవిష్యత్తు బాగుండాలని ఆశించాం. కానీ అది మోసపూరిత మృగజాలం అని తెలియలేదు” అని బాధితులు ఆవేదన చెందుతున్నారు. భవితశ్రీ చిట్స్ మోసం, సామాన్యుల విశ్వాసాన్ని మాత్రమే కాదు… చిట్ సంస్థలపై నమ్మకాన్ని కూడా పాతాళానికి నెట్టేసింది.
రాజకీయ సంబంధాలు.. కాపాడతాయా...?
గుండా ప్రకాష్ రావు మాజీ మేయర్ కావడంతో, ఆయనకు ఉన్న రాజకీయ అనుబంధాలు కేసు దర్యాప్తులో ఎలాంటి మలుపులు తిప్పుతాయన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రజల్లో అయితే “అధికార, రాజకీయ ప్రభావంతో ఇంతవరకు ఈ మోసాలు నడిచాయి. అయితే గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎవరైనా చిట్టి వేసిన బాధితులు డబ్బులు ఇవ్వమని నిలదీస్తే పలు జిల్లాల్లో వారిపై రాజకీయ నాయకుల అండదండలతో అక్రమ కేసులు బనాయించినట్లు తెలుస్తుంది.ఇప్పుడు నిజంగా కఠిన చర్యలు తీసుకుంటారా లేదా అన్నది చూడాలి” అన్న చర్చ మొదలైంది.
ప్రభుత్వం హామీ...
బాధితులు న్యాయం పొందేలా, వారి డిపాజిట్లు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు హామీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ కేసును ఎకానమిక్ ఆఫెన్సెస్ వింగ్ (EOW) కు అప్పగించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆస్తులను సీజ్ చేసి, డిపాజిటర్లకు రీఫండ్ చేసే అవకాశాలు కూడా పరిశీలనలో ఉన్నాయని సమాచారం.ఈ కేసులో A1 నిందితునిగా ఉన్న గుండా ప్రకాష్ రావును హన్మకొండ పోలీసులు అరెస్ట్ చేయగా మేనేజింగ్ డైరక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ తో పాటు మిగతా ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.
Admin
Aakanksha News