ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : దేశంలోని సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే దిక్కు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన జెఎన్టీయూ లో ఏర్పాటు చేసిన అంబేద్కర్ వర్ధంతి సభలో ప్రసంగించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం అనగారిన వర్గాల కోసమే మాత్రం కాదు.. సకల వర్గాల అభ్యున్నతికి ఆయన శ్రమించారని ఆయన కేవలం దళితులు ,గిరిజనలు, అణగారిన వర్గాల కోసమే పని చేశారని చిత్రించడానికి చాలామంది ప్రయత్నం చేస్తున్నారు అది సరైనది కాదు అన్నారు. ఆయన కృషి ద్వారానే అందరికీ సమానంగా ఓటు హక్కు లభించింది అన్నారు. ఓటు హక్కు లేకపోతే ఏ రాజకీయ నాయకుడు ఇంటికి వచ్చి రెండు చేతులు జోడించి దండం పెట్టేవాడు కాదు అన్నారు. హిందూ వివాహ చట్టం ద్వారా అనగదొక్కబడిన మహిళలకు హక్కులు కల్పించారని అందుకోసం ఆయన తన న్యాయశాఖ మంత్రి పదవిని వదులుకున్నారని గుర్తు చేశారు. ఆయన కృషి ద్వారా వచ్చిన హిందూ వివాహ చట్టం మూలంగా మహిళలకు ఆస్తిలో వాటా, విడాకులకు చట్టబద్ధత లభించింది అన్నారు. మహిళలకు మెటర్నిటీ లీవ్, మైనింగ్ లేబర్ యాక్ట్ ఇవన్నీ ఒక వర్గానికి సంబంధించిన హక్కులు కాదు అన్నారు. 8 గంటల పని విధానాన్ని అమల్లోకి తెచ్చిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు మేడే సందర్భంగా అందరూ దండ వేయాలని అన్నారు. అంబేద్కర్ మనదేశంలో పుట్టడం మనందరి అదృష్టం, ఆయన ద్వారా అద్భుతమైన రాజ్యాంగం మన దేశానికి అందుబాటులోకి వచ్చింది అన్నారు. బాబాసాహెబ్ జీవితంలోని అనేక సంఘటనలను ఆయన పాజిటివ్గా తీసుకున్నారని.. బడిలో కూర్చునే అవకాశం ఇవ్వకపోయినా బడి బయట కూర్చుని పంతం పట్టి చదువుకుని కొలంబియా విశ్వవిద్యాలయం వరకు వెళ్లారని నేడు యావత్ ప్రపంచం బాబాసాహెబ్ గురించి మాట్లాడుకునే స్థాయికి చేరుకున్నాడని అన్నారు. సమాజంలో అసమానతలు తగ్గించడానికి ఆయన అనేక విద్యాసంస్థలు స్థాపించారని తెలిపారు. భారతదేశంలో సకల సమస్యల పరిష్కారానికి భారత రాజ్యాంగం ఒక్కటే ఆధారం అని మనమంతా బలంగా విశ్వసిస్తే అది మనల్ని కాపాడుతుంది అన్నారు. ప్రియాంబుల్ ను అందరూ నెలకు ఒకసారైనా చదవాలని, భారత రాజ్యాంగ సారం మొత్తం ఆ ఒక్క పేజీలో ఉంటుందని తెలిపారు. తాను ప్రియాంబుల్ అమలు నిత్యం ప్రయత్నిస్తానని తెలిపారు. మనదేశంలో అద్భుతమైన మానవ వనరులు ఉన్నాయి అవి జాతుల మధ్య పోరాటంతో నిర్వీర్యం అవుతున్నాయి, అది లేకుండా ఉంటే భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో మొదటి స్థానంలో ఉండేది అన్నారు. విద్య ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమని అంబేద్కర్ చూపిన మార్గాన్ని యావత్ రాష్ట్ర ప్రభుత్వం బలంగా విశ్వసించి ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఒక ఏడాదిలో రెసిడెన్షియల్ పాఠశాలలకు 70 కోట్లు ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణానికి ఒక ఏడాదిలోని 5 వేల కోట్లు ఖర్చు చేస్తుందని వివరించారు. గత పది సంవత్సరాలుగా డీఎస్సీ జాడలేదు.. మేం అధికారంలోకి రాగానే 11000 పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాం, మరో 6000 పోస్టులతో మరో డీఎస్సీ నిర్వహిస్తున్నామని తెలిపారు. 65 ఐటిఐ లను అడ్వాన్సుడ్ టెక్నాలజీ కేంద్రాలుగా మార్చామని తెలిపారు. సమగ్ర కుల గణన చేస్తామని ఎన్నికల ముందు చెప్పారు ఆ మేరకు.. సమగ్ర కుటుంబ సర్వే 99% పూర్తయింది.. వాటి వివరాలను త్వరలోనే ప్రజల ముందు పెడతామని తెలిపారు. సర్వే ద్వారా రాజకీయ, ఆర్థిక గుత్తాధిపత్యం ఎక్కడ ఉందో తెలుసుకొని వాటిని పునర్నిర్మానం చేస్తామన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ ఎవరి స్థాయిలో వారు కృషి చేయడమే అంబేద్కర్ కు ఘన నివాళి అర్పించడం అని తెలిపారు.
Admin
Aakanksha News