ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : అధికార పార్టీ శాసనసభ్యుల్లో సర్వేల గుబులు మొదలైంది. పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గెలుపు గుర్రాల అన్వేషణలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తును ప్రారంభించడంతో పెద్దపల్లి జిల్లా రాజకీయం పెను సంచలనాన్ని కలిగిస్తుంది. జిల్లాలోని పెద్దపల్లి, రామగుండం నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అసమ్మతి నేతలు గళం విప్పడంతో అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించి నేతలపై ఫోకస్ పెట్టినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలోనే త్వరలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రామగుండం నియోజకవర్గంపై అధిష్టానం పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లు తెలుస్తోంది.. పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజక వర్గాల్లో జరుగుతున్న రాజకీయ సమీకరణాలను ఎప్పటికప్పుడు అధిష్టానం ఇంటలిజెన్స్ నివేదికల ఆధారంగా సర్వే రిపోర్టులను పరిశీలిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే గత కొన్ని నెలలుగా ఆయా నియోజకవర్గాల్లో అసమ్మతి నేతలు సొంత పార్టీ ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న క్రమంలో అధిష్టానం సైతం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు పలువురు నాయకులు చర్చించుకుంటున్నారు. దీంతో ప్రస్తుత పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి. రామగుండం నియోజక వర్గంలో అసమ్మతి నేతలు స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పై తిరుగుబాటు చేయడం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా " ప్రజా ఆశీర్వాద యాత్ర" పేరుతో పాదయాత్ర ప్రారంభించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం కలిగించింది. దీంతో పాటు అసమ్మతి నేతలు మరో అడుగు ముందుకు వేసి త్వరలో భారీ బహిరంగ సభను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించడంతో వెంటనే స్పందించిన అధిష్టానం పెద్దపల్లి నియోజక వర్గంపై దృష్టి సారించింది. వెంటనే జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా అసమ్మతి నేతులకు పిలుపు రావడంతో అసెంబ్లీ సమావేశాల అనంతరం హైదరాబాద్ లో ఐటీ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అసమ్మతి నేతలు కేటీఆర్ దృష్టికి పలు అంశాలను తీసుకువెళ్లడంతో ఒక్కసారిగా రామగుండం రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాల కంటే, పెద్దపల్లి రాజకీయాలపైనే అధిష్టానం ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. దీంతో అసమ్మతి నేతలకు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళవద్దని కేటీఆర్ సూచించడంతో వారు కూడా అంగీకరించినట్లు సమాచారం. అయితే రామగుండం రాజకీయాలను చక్కబెట్టేందుకు జిల్లా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు రామగుండం నియోజకవర్గ ఇంచార్జీగా మంత్రి కేటీఆర్ బాధ్యతలను అప్పగించడంతో రామగుండం రాజకీయాలపై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే స్థానిక నాయకుల రాజకీయ భవిష్యత్ పై నీలి నీడలు కొనసాగుతున్నాయి. అయితే త్వరలో జిల్లా మంత్రి కూడా నియోజకవర్గ పర్యటన చేపట్టి రాజకీయ గందరగోళ పరిస్థితులను చక్కదిద్దే అందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే పెద్దపల్లి జిల్లాలోని ఓ నియోజకవర్గ నాయకుడిపై కూడా ఆయా నియోజకవర్గంలో వస్తున్న వ్యతిరేకతతో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సారి ఆ నీయోజకవర్గంలో సదురు నాయకుడిని అధిష్టానం పక్కన పెట్టే ఆలోచనలో ఉన్నట్లు రాజకీయ ప్రచారం సాగుతుంది. ఈ పరిణాలన్నింటిని ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు సర్వేల రూపంలో అధిష్టానం దృష్టి సారించడంతో నియోజకవర్గ వివరాలు, జరుగుతున్న పరిణామాలు, కార్యక్రమాలన్నీ అధిష్టానానికి రిపోర్టులు అందుతున్నట్లు పలువురు గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కు బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్దపల్లి జిల్లా లో పెను రాజకీయ మార్పులు చోటు చేసుకోనున్నాయనే వాధనలు పలువురు రాజకీయ విశ్లేషకులు నుండి వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా తీరు మారని నేతలపై అధిష్టానం వేటు వేసేందుకు సిద్ధమైనట్లు చర్చించుకుంటున్నారు.
Admin
Aakanksha News