Tuesday, 28 July 2026 05:01:02 AM

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై ‘జాగృతి’ కార్యకర్తల దాడి...

గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన గన్‌మెన్‌...

Date : 13 July 2025 12:54 PM Views : 847

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్నాయి. నగర శివారులోని మేడిపల్లిలో ఉన్న ప్రముఖ యూట్యూబ్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ (చింతపండు నవీన్‌) కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో జాగృతి కార్యకర్తలు ఆగ్రహోద్రిక్తులయ్యారు.కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే యత్నం చేశారు. జవహర్‌నగర్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్న కార్యకర్తలు కార్యాలయం గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. ఆ తర్వాత ఫర్నిచర్ ధ్వంసం చేస్తూ లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో మల్లన్న సిబ్బంది తలుపులు మూసి అంతర్గతంగా తాళాలు వేశారు. దీంతో కార్యాలయంలోని భద్రతా సిబ్బందిలో ఉన్న గన్‌మెన్ ఆందోళనకారులు బలవంతంగా లోపలికి రావడానికి యత్నించడంతో గాలిలోకి ఐదు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. దీంతో అక్కడ ఒక్కసారిగా అల్లకల్లోలం నెలకొంది. కాల్పుల శబ్దంతో కార్యకర్తలు వెనక్కి తగ్గారు.విషయం తెలియగానే మేడిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి భారీ బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఇరు వర్గాలను సముదాయించి అక్కడి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆందోళనకారులను అక్కడి నుంచి తరిమి పంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ ఘటనతో మేడిపల్లి ప్రాంత ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. పొలిటికల్ అభిప్రాయాల విభేదాలు ఇలాంటివిగా మారడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మల్లన్నపై గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు, కేసులు నమోదైన సంగతి తెలిసిందే.పోలీసులు ఇప్పటికే ఆ ప్రాంతంలోని సిసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి పోలీసులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :