ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / మంథని : మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు సంచలన ఆరోపణలు చేసారు. దీంతో మంథని రాజకీయం మల్లి రసవత్తరంగా మారుతుంది. మంత్రి శ్రీధర్‌బాబు తన తమ్ముడు శ్రీనుబాబుకు దక్కన్ సిమెంట్ కంపనీలో వాటాల కోసం మారుమూల పలిమెల రైతుల భూములను అన్యాక్రాంతం చేస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఆరోపించారు. మంగళవారం పలిమెల మండలంలోని బాధిత రైతుల భూములను సందర్శించిన ఆయన ఆక్కడే ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత రైతులతో కలిసి మాట్లాడారు. పలిమెల మండలంలోని బోడాయిగూడెం, పంకెన, పలిమెలకు సంబంధించిన సుమారు 300 మంది రైతులు తాత తండ్రుల నుండి కాస్తులో ఉండి పంటలు పండించుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు శ్రీధర్‌బాబు అనుచరులైన వనం రాంచందర్‌రావు, చొప్పరి సదానందం, రొడ్డ బాపు, బండారి సదానందం, బొల్లెపల్లి వెంకటస్వామిగౌడ్, తాటి గోపాల్‌గౌడ్, పులి రాజేశం, తుల్సెగారి తిరుపతి పటేల్, పున్నం మధూకర్‌రెడ్డి, చల్ల జక్కిరెడ్డితో పాటు మరికొంత మంది పేరిట 2008లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో శ్రీధర్‌బాబు విప్‌గా ఉన్న సమయంలో 300 ఎకరాల వరకు మహ్మద్ కమాలుద్దీన్ అనే వ్యక్తి ద్వారా మంథని రిజిష్ట్రేషన్ చేయించినట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు గెలిచి పరిశ్రమల మంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత తన అనుచరుల పేరిట ఉన్న భూములను సుమారు 200 ఎకరాల వరకు ఈ నెల 10వ తేదీన దక్కన్ సిమెంట్స్ లిమిటెడ్ కంపనీ పేరు మీదకు మార్పించారు. ప్రతిగా దక్కన్ సిమెంట్ కంపనీలో ఆయన సోదరుడు శ్రీనుబాబుకు 50 శాతం వాటా ఒప్పందం చేసుకున్నారని ఆయన ఆరోపించారు. తన తమ్మునికి సిమెంట్ కంపనీలో వాటా కోసం ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను లాగేసుకోవడం ఎంత వరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. బాధిత రైతులను పోలీసులతో బెదిరించి సదరు భూములను సిమెంట్ కంపనీకి కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, సిమెంట్ కంపనీ పేరిట రిజిస్ట్రేషన్ చేసిన భూముల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత రైతుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే పలిమెల మరో లగచర్ల అవుతుందని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పరిశ్రమల మంత్రిగా ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని ప్రజలు ఆశిస్తే ఈయన మాత్రం ఉన్న భూములకు ఎసరు పెట్టాడని విమర్శించారు. ఒక్క వ్యక్తి 2008లో 300 ఎకరాలు ఎలా రిజిస్ట్రేషన్ చేశాడని, అసలు ఆ భూములకు కమాలుద్దీన్ వారసుడకే కాదని మంత్రి శ్రీధర్‌బాబే విప్‌గా ఉన్న సమయంలో అధికార దుర్వినియోగం ద్వారా సాగు చేసుకుంటున్న రైతులకు చెందాల్సిన సీలింగ్ భూములను తన అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించాడని, ఇప్పుడు మంత్రిగా తన అనుచరుల పేరిట ఉన్న భూములను దక్కన్ సిమెంట్ కంపనీకి బదలాయించి బదులుగా తన తమ్మునికి వాటాలు దక్కించుకున్నాడని తెలిపారు. ఇప్పటికైనా మంథని ప్రాంత ప్రజలు మేల్కొని శ్రీధర్‌బాబు నక్క వినయాలను గుర్తించాలని కోరారు. రైతుల పొలాల్లోకి ఎవరినీ అడగు పెట్టనిచ్చేది లేదని, భేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పి శ్రీధర్‌బాబే తిరిగి రైతులకు భూమిని బదలాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలు తీవ్రతరం చేసి మరో భూపోరాటం సాగించక తప్పదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పలిమెల బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి, రాష్ట్ర యువజన నాయకుడు జక్కు రాకేష్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీత, కాటారం, మహదేవ్‌పూర్ బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు జోడు శ్రీనివాస్, లింగపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ శ్రీపతిబాపు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు పంతకాని సడవలి, నాయకులు అంకరి ప్రకాష్, నరివెద్ది శ్రీనివాస్, రాకేష్, కుమ్మరి సారయ్య, రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News