ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : తెలంగాణ రాజకీయాల్లో కొత్త సంచలనం రేపేలా బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఘాటు వ్యాఖ్యలతో మళ్లీ రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, వరదలు వచ్చినా ప్రజలను ఆదుకునే స్థితి లేని దుస్థితి నెలకొన్నదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలపై దృష్టి పెట్టకుండా ఎప్పుడూ కేసీఆర్ పేరే జపం చేస్తోందని ఆరోపించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో యూరియా కొరత, వరదల సమస్యలు, రైతుల ఆందోళనలు అన్నీ విస్తృతమవుతున్నాయని విమర్శించారు. మేము ఎంపీలుగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆరు నెలల ముందుగానే యూరియా కొరత వచ్చే అవకాశాన్ని గుర్తించి మమ్మల్ని అలెర్ట్ చేసేవారని గుర్తు చేశారు. ఆయనకు తిండి ధ్యాస, డబ్బు ధ్యాస ఎప్పటికీ ఉండదని, ప్రజల కోసం ఎల్లప్పుడూ కష్టపడతారని వివరించారు.కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రస్తావన చేస్తూ కవిత ఆ ప్రాజెక్టు శాశ్వత ఆస్తిగా నిలుస్తుందని, 200 సంవత్సరాలు ప్రజలు గుర్తుంచుకునే విధంగా నిర్మాణం జరిగిందని చెప్పారు. అందులో మేడిగడ్డ అనేది చాలా చిన్న భాగమని, దానిని చూపిస్తూ మొత్తం ప్రాజెక్టును అపవాదపరచడం సరికాదని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు నీళ్లు తేవడానికి ఆరు, ఏడు నెలలు రీసెర్చ్ చేసి నిర్మాణం చేపట్టారని, ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించిన మహానేత అని అన్నారు. కేసీఆర్‌కు అవినీతి మరక అంటించడం అనేది పూర్తిగా తప్పుడు ప్రచారమేనని, ఆయన పక్కన ఉన్న కొందరి వల్లే ఆ మరక అంటుకుందని కవిత ఆరోపించారు. హరీష్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగా కృష్ణారెడ్డి పాత్ర ఇందులో ఉందని స్పష్టంగా పేర్కొన్నారు. ఆ ఇద్దరి తప్పిదాల వల్లే కేసీఆర్ పై అపవాదం మోపబడిందని, కానీ ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు.తనపై కుట్రలు చేసిన వారిపై కూడా ఆమె దుమ్మెత్తిపోశారు. హరీష్ రావు, సంతోష్ రావు నాపై ఎన్నో కుట్రలు చేశారు. ఆ కుట్రల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారని నేరుగా ఆరోపించారు. దగ్గరగా ఉండి కేసీఆర్‌ను బాద్నాం చేసే అవినీతి అనకొండలు ఉన్నాయని మండిపడ్డారు. సోషల్ మీడియాలో తాను బీజేపీ, కాంగ్రెస్ వెనుక నిలబడి ఉన్నట్టు ట్రోల్ చేస్తున్నారని, కానీ తాను ఎప్పుడూ స్వతంత్రంగానే ఉంటానని కవిత స్పష్టం చేశారు. “నాది కేసీఆర్ బ్లడ్. నాపై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తే మీ తోలు తీస్తా” అంటూ ఘాటు హెచ్చరికలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కవిత ఘాటుగా విరుచుకుపడ్డారు. పి.సి.ఘోష్ కమిషన్ పేరుతో టైం పాస్ చేస్తోందని, రేవంత్ రెడ్డి కేసీఆర్ పేరు చెప్పకపోతే పేపర్‌లో ఆయన ఫోటో రాదని ఎద్దేవా చేశారు. తాను నేరుగా పేర్లు చెబుతున్నానని, వారిపై విచారణ జరపాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ నాయకులు తమ మధ్య ఉండే ఒప్పందాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. బీహార్ ఎన్నికల కోసం తెలంగాణ బీసీలను బలి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు.బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము కాంగ్రెస్ వ్యతిరేకంగా బహిరంగ ప్రచారం చేస్తామని కవిత బహిరంగంగా ప్రకటించారు. తెలంగాణ బీసీలను బలి చేసి రాజకీయ లాభం పొందాలని చూసే కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చిందని అన్నారు.కేసీఆర్ రాజకీయ భవిష్యత్తుపై ధీమా వ్యక్తం చేసిన కవిత, ఆయనపై ఎలాంటి కుట్రలు చేసినా, ఎన్ని ఆరోపణలు చేసినా కడిగిన ముత్యంలా బయట పడతారని నమ్మకంగా చెప్పారు. నేడు రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్‌ను విమర్శించే స్థితి రావడం దురదృష్టకరమని, కానీ ఆ పరిస్థితికి దారితీసింది ఆయన పక్కన ఉన్న కొందరి తప్పిదాలేనని అన్నారు. అయినా కేసీఆర్ ప్రజల మనసుల్లో మహానేతగా ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తారని కవిత ఘాటుగా వ్యాఖ్యానించారు.
Admin
Aakanksha News