ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఖాళీల భక్తీకి సంబంధించిన డీఎస్సీ (TS DSC) దరఖాస్తుల ప్రక్రియ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానున్నది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత ఆన్‌లైన్ అప్లికేషన్లు షురూ అవనున్నాయి. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. మొత్తం 11,062 పోస్టులకు భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనే విషయాన్ని విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. తాజాగా జిల్లాల వారీగా ఏ సబ్జెక్టుకు ఎన్ని ఖాళీల వివరాలు, ఖాళీలకు సంబంధించిన రోస్టర్‌ను తాజాగా విడుదల చేసింది. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించే (సీబీటీ) ఈ పరీక్షల తేదీలను ఇంకా వెళ్లడించలేదు. త్వరలోనే ప్రకటిస్తామని అందులో పేర్కొన్నది. అర్హతలు.. నిబంధనలు * సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు కేవలం డీఎడ్ పూర్తిచేసినవారే అర్హులు. బీఎడ్ వారు పోటీపడేఅవకాశంలేదు. * స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు (ఎస్‌ఏ) పోస్టులకు సంబంధిత మెథడ్‌లో బీఎడ్ పూర్తిచేసినవారు అర్హులు. నాలుగేండ్ల బీఎడ్ పూర్తిచేసినవారు సైతం పోటీపడొచ్చు. *ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసేవారు ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. దీంతోపాటు, యూజీ డీపీఈడీ కోర్సు పూర్తిచేసి ఉండాలి. డిగ్రీ పూర్తిచేసినవారు.. బీపీఈడీ కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. · బీఎడ్, డీఎడ్ చివరి సంవత్సరం/చివరి సెమిస్టర్ పరీక్షలు రాసినవారు కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. · అభ్యర్థుల గరిష్ఠ వయో పరిమితికి కటాఫ్ తేదీగా 1-7-23ను నిర్ణయించారు. ఈ తేదీలోగా 46 సంవత్సరాలు గలవారై ఉండాలి. కనిష్ఠ వయోపరిమితి 18 ఏండ్లుగా ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు 5, మాజీ సైనికులకు 3, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 5, దివ్యాంగులకు 10 ఏండ్ల సడలింపు వర్తిస్తుంది. · తెలంగాణ, ఏపీ టెట్, లేదా సెంట్రల్ టెట్ (సీ టెట్)లో క్వాలిఫై అయి ఉండాలి. · గతంలో ఏజెన్సీ పోస్టుల్లో 100 శాతం గిరిజనులకే కేటాయించగా, ఈ నిబంధనను తాజాగా ఎత్తివేశారు. అంతా పోటీపడొచ్చు. · ఎస్టీ రిజర్వేషన్ గతంలో 6 శాతం ఉండగా, పెంచిన 10 శాతాన్నే వర్తింపజేస్తారు. · గతంలో లోకల్, ఓపెన్ కోటా రిజర్వేషన్ 80:20 పద్ధతిలో ఉండగా, తాజాగా 95:5 రేషియోను అమలుచేస్తారు. · అభ్యర్థుల స్థానికతను నిర్ధారించేందుకు గతంలో 4-10 తరగతుల చదువును పరిగణనలోకి తీసుకోగా, తాజాగా 1-7 తరగతులను లెక్కలోకి తీసుకుంటారు. · జీవో-3 ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లు అమలుచేస్తారు. మూడు పోస్టులుంటే ఒక పోస్టును మహిళతో భర్తీ చేస్తారు.
Admin
Aakanksha News