ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / : చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టె పోలీసులపై రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఉంటాయని రిటైర్డ్, బదిలీ అయినా కూడా వారిని వదిలిపెట్టేది లేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ హెచ్చరించారు.అధికారం అండ చూసుకొని కొంత మంది పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని అయన మందిపడ్డారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. నకిరేకల్‌లో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మూడు కేసులు ఎలా పెడతారని ప్రశ్నించారు. ఒక్క కేసులో ఒక్క ఎఫ్‌ఐఆర్ మాత్రమే నమోదు చేయాలని కోర్టు తీర్పులు అనేకంగా ఉన్నాయని గుర్తుచేశారు.పోలీసు అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. సిద్దిపేటలో చేయని నేరానికి నా మీద సోషల్‌మీడియా కేసు పెట్టారని తెలిపారు. కానీ హరీశ్‌రావు, కేటీఆర్‌ను పెట్రోలు పోసి చంపుతామన్న మైనంపల్లి హనుమంతరావు మీద ఇంత వరకు ఎందుకు ఎఫ్‌ఐఆర్ చేయలేదని ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో కేసుల స్క్రిప్ట్ తయారు చేస్తున్నారని, పోలీసు అధికారులు వాటిని యదాతథంగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేస్తున్నారని విమర్శించారు. అధికారులు ఇప్పటికైనా బాధ్యతాయుతంగా పనిచేయాలని లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ సోషల్ మీడియా వారియర్స్‌పై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఉపసంహరించుకోని తప్పుచేస్తున్న పోలీసు అధికారులకు కౌన్సెలింగ్ చేయాలన్నారు.
Admin
Aakanksha News