ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మే 9 మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా విధులలో చేరాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా మే 9 మంగళవారం సాయంత్రం 5 గంటలలోగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు విధులలో చేరాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు తమ అగ్రిమెంట్ బాండ్‌ను ఉల్లంఘిస్తూ యూనియన్‌గా ఏర్పడి, తమ సర్వీస్ రెగ్యులరైజేషన్ డిమాండ్‌తో 2023 ఏప్రిల్ 28 నుండి సమ్మెకు దిగినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు అందరూ ఏ సేవా సంఘం, సంస్థ, సంఘంలో చేరను అని అగ్రిమెంట్ బాండ్ మీద సంతకం చేసి ఇచ్చారని, అలాగే జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా రెగ్యులర్ ప్రాతిపాదికన నియమించ బడడానికి నాకు ఎలాంటి దావా లేదా హక్కు ఉండదని జూనియర్ పంచాయతీ కార్యదర్శులు రాసి ఇచ్చారని తెలిపారు.కాంట్రాక్టు ఉద్యోగి యొక్క సర్వీస్ రెగ్యులరైజేషన్ ప్రభుత్వం నియమించిన కమిటీ ద్వారా వారి పనితీరు అంచనా, మూల్యాంకనానికి లోబడి ఉంటుందని, పనితీరు సంతృప్తికరంగా ఉన్నట్లు గుర్తించిన వారిని మాత్రమే క్రమబద్ధీకరణ జరుగుతుందని తెలిపారు.ఈ వాస్తవాలు అందరికీ తెలిసినప్పటికీ, మీరందరూ ఒక యూనియన్‌గా ఏర్పడి 28 ఏప్రిల్, 2023 నుండి చట్టవిరుద్ధంగా సమ్మె చేస్తున్నారని చివరి అవకాశంగా మే 9వ తేదీ మంగళవారం సాయంత్రం 5 గంటల లోపు అందరూ విధుల్లో చేరెందుకు చివరి అవకాశం కల్పించామని, ఒకవేళ 9 మే, 2023 సాయంత్రం 5 గంటలలోపు జూనియర్ పంచాయతీ కార్యదర్శులు డ్యూటీలో చేరడంలో విఫలమైతే వారి సేవలు రద్దు చేయబడతాయని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Admin
Aakanksha News