Tuesday, 28 July 2026 08:01:18 AM

ఫోన్‌ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్...

Date : 28 January 2025 06:47 AM Views : 486

ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / హైదరాబాద్ : సంచలనం రేపిన ఫోన్‌ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇన్నాళ్లు అరెస్ట్‌లు, దర్యాప్తులు, విచారణల తర్వాత- ఈ కేసులో తొలి బెయిల్ వచ్చింది. అడిషినల్ ఎస్‌పి తిరుపతన్నకు షరతులతో కూడిన బెయిల్ ను సుప్రీంకోర్టు మంజూరు చేసింది. ట్రయల్‌కు తిరుపతన్న పూర్తిగా సహకరించాలని, జాప్యం చేయడానికి ప్రయత్నించవద్దని తెలిపింది. సాక్షులను ప్రభావితం చేసినా, కేసులో ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినా రాష్ట్ర ప్రభుత్వం బెయిల్ రద్దుకు కోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. పాస్‌పోర్టు రద్దు సహా ఇతర బెయిల్ షరతులు అన్నింటినీ ట్రయల్ కోర్టు ఇస్తుందని సుప్రీంకోర్టు చెప్పింది. అంతకు ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది లూథ్రా వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో తిరుపతన్నే ప్రధాన నిందితుడని కోర్టుకు వెల్లడించారు. దీంతో ఆయన పాత్రపై దర్యాప్తునకు మరో నాలుగు నెలల సమయం పడుతుందని వివరించారు. కొంతమంది కీలక సాక్షులను ఇంకా విచారించాల్సి ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో తిరుపతన్నకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు.రాజకీయ నేతల ఆదేశాలతో హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఆయన ట్యాప్ చేశారని ఆరోపించారు. ఆధారాలు చెరిపేయడంతో కీలకంగా వ్యవహరించారని, ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఆధారాలన్నీ ధ్వంసం చేశారన్నారు. తిరుపతన్న పాస్‌పోర్టును వెంటనే సరెండర్ చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. కేసులో కీలకమైన ఇద్దరు నిందితులు ఇప్పటికే విదేశాలను పారిపోయారని న్యాయవాధి లూథ్రా వెల్లడించారు. వాస్తవానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యిన వారిలో మొదటి వ్యక్తి తిరుపతన్న. ఫోన్ ట్యాపింగ్ కేసులో నలుగురిని గత ఏడాదిలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అడిషనల్ ఎస్‌పి ప్రణీత్ రావ్, అడిషనల్ ఎస్‌పి భుజంగ రావ్, అడిషనల్ ఎస్‌పి తిరుపతన్న, మాజీ టాస్క్ ఫోర్స్ డిసిపి రాధాకిషన్ రావ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు. దాదాపు 10 నెలలకు పైగా జైలులోనే ఉన్నారు. బయటికి వచ్చేందుకు అనేక సార్లు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేసినప్పటికీ రిజెక్ట్ అవుతూ వచ్చాయి. హైకోర్టులో పలుమార్లు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినప్పటికీ ఇక్కడ ఊరట లభించలేదు.తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించగా అడిషనల్ ఎస్‌పి తిరుపతన్నకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్నను గత ఏడాది 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో అదే సమయంలో మరో అడిషనల్ ఎస్‌పి భుజంగరావును సైతం పోలీసులు అరెస్టు చేశారు. వీరిద్దరూ అనేకసార్లు లోయర్ కోర్టుతో పాటు హైకోర్టులోను బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటివరకు ఎవరికీ పూర్తిస్థాయిలో బెయిల్ మంజూరు కాలేదు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ పొందిన మొదటి వ్యక్తి తిరుపతన్న. సుప్రీం కోర్టు ఆదేశాలతో జైలు నుంచి విడుదల కానున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :