ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / గోదావరిఖని : ఫిబ్రవరి 16వ తేదీన దేశ వ్యాప్తంగా కొన్ని కార్మిక సంఘాలు వివిధ డిమాండ్లతో ఒక రోజు సార్వత్రిక సమ్మెకు పిలుపునిస్తూ, ఆ సమ్మెలో లో సింగరేణి కార్మికులు కూడా పాల్గొనాలని పిలుపు నిచ్చాయని సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్.బలరామ్ అన్నారు.కానీ ఈ సమ్మె డిమాండ్లలో సింగరేణి కార్మికులకు సంబంధించినవి కావని, సింగరేణి యజమాన్యం తీర్చగలిగినవి కూడా కావని, మన సింగరేణి సంస్థ పరిధిలోని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉందని అటువంటప్పుడు మన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనవలసిన అవసరం ఉందా అని ఒక సారి ఆలోచించాలని సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్.బలరామ్ ఒక్క ప్రకటనలో కార్మికులను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే వివిధ కారణాల వలన ఈ ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపులలో కొంత వెనకబడి ఉన్నామని, ఈ సమయంలో లక్ష్యసాధనకు ప్రతి రోజు సాధించే ఉత్పత్తి కూడా ఎంతో తోడ్పాటునందిస్తుందని అదే విధముగా నిరంతరాయముగా విద్యుత్ సరఫరా జరగడానికి మనం నిర్దేశించిన ఉత్పత్తి సాదిస్తూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.మనం ఒక్కరోజు సమ్మె చేస్తే సంస్థ నష్ట పోయే ఉత్పత్తి విలువ సుమారు రూ.85 కోట్లు ఉంటుందని అలాగే కార్మికులు సుమారు రూ.18 కోట్ల వేతనాలు కోల్పోతారని తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరం 2022-23 లో 67.14 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, 66.69 మిలియన్ టన్నుల బొగ్గు రవాణా జరిపి రూ.2,222.46 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించామని, ఆ లాభాల నుండి లాభాల బోనస్, పిఎల్ఆర్ బోనస్ లు ఉద్యోగులకు చెల్లించడంతో పాటు వివిధ సంక్షేమ పధకాలను కూడా అమలుచేయడం జరుగుతున్నది తెలియజేశారు.అదే విధముగా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకు మనం 59.13 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాం అని, మిగిలిన 47 రోజులలో లక్ష్య సాధనకై ప్రతి రోజు శ్రమించాల్సి ఉందని కావున ఫిబ్రవరి 16వ తేదీన తలపెట్టిన సార్వత్రిక సమ్మెకు దూరంగా ఉండి విధులకు హాజరై 2023-24 ఆర్ధిక సంవత్సర ఉత్పత్తి లక్ష్య సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీ ఎన్.బలరామ్ విజ్ఞప్తి చేశారు.
Admin
Aakanksha News