ఆకాంక్ష న్యూస్ - హైదరాబాద్ / పెద్దపల్లి జిల్లా : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా ప్రధాన పార్టీలు ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రచారాలను ముమ్మరం చేసుకుంటున్నారు. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించగా వారికి దీటుగా ఆయా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపి ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఓవైపు కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడితో పాటు సీనియర్ నాయకులు ప్రచారాన్ని చేసుకుంటూ ముందుకు వెళుతుంటే దీనికి భిన్నంగా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు టికెట్ వస్తుందని ఇప్పటికే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ తన ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తుంటే దీనికి పోటీగా ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తనకు కార్మిక కోట కింద టికెట్ కేటాయించాలని డిమాండ్ చేయడం చర్చనీయాంశంగా మారుతుంది. అయితే తనకు టికెట్ కేటాయించకపోతే కార్మిక సంఘం తరఫున నిరాకరణ తప్పదంటూ హెచ్చరికలు జారీ చేయడం రాజకీయ వర్గంలో చర్చకు దారి తీస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఖరారు ప్రకటించక ముందే నేనంటే నేనే అని చెప్పుకొని ప్రచారాలు చేయడం "ఉన్నదాన్ని విడిచిపెట్టి లేని దాన్ని పట్టినట్లు" అన్న చందంగా ఉందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఓవైపు అధిష్టానం వద్ద టికెట్ల పంచాయతీలో సీనియర్ల మధ్య విభేదాలు తలెత్తుతున్న నేపథ్యంలో నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం పార్టీకి నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నాయని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే అవకాశం ఇచ్చిన గెలవకపోవడం ప్రజల్లో ఆదరణ లేకపోవడంతో ఈసారి అభ్యర్థిని మార్చాలనే విమర్శలు సొంత పార్టీ నేతలే చేయడం ముక్కున వేలేసుకునేలా ఉన్నాయని పలువురు పేర్కొంటున్నారు. ఎన్టీయూసీ కార్మిక సంఘం సీనియర్ నేత జనక్ ప్రసాద్ టికెట్ కావాలని లేకపోతే సింగరేణి వ్యాప్తంగా నిరాకరణ కొనసాగుతుందని ప్రకటించడం కాంగ్రెస్ పార్టీకి నష్టమేనని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్దేశించేది సింగరేణి కార్మికుల ఓట్లేనని కార్మికుల ఓట్లు కీలకంగా ఉండటంతో కార్మిక సంఘం నేతలు మద్దతు తెలుపకుంటే ఓటమి తప్పదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసలు అభ్యర్థి ఎవరో తెలియదు కానీ.. నేనంటే నేనని గొప్పలు చెప్పుకుంటూ ప్రచారాన్ని నిర్వహించడం పట్ల పలువురు ముక్కున వేలేసుకొని నవ్వుకునే పరిస్థితులు నెలకొంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా రామగుండం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనే దానిపై అధిష్టానం ఏలాంటి నిర్ణయం తీసుకుంటుందో... ముందు ముందు ఎటువంటి రాజకీయ పరిస్థితులు దారితీస్తాయో వేచి చూడాల్సిందే....
Admin
Aakanksha News